ప్రస్తుతం వాట్సాప్ అత్యంత ప్రాధాన్యత గల తక్షణ సందేశ సాధనం మాత్రమే కాదు మన జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రవేశ స్థాయి స్మార్ట్ ఫోన్ ల నుండి ఖరీదైన స్మార్ట్ ఫోన్ ల వరకు దాదాపుగా అన్నీ వాట్సాప్ ను సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం రవాణా వ్యవస్థ సరిగాలేని గ్రామాల్లో సైతం వాట్సాప్ వినియోగదారులున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈ సంవత్సరంతో కొన్ని మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయటం మానేస్తుంది. మారుతున్న సాంకేతిక ఆవిష్కరణల దృష్ట్యా, కొత్త ఫీచర్స్ ఇవ్వటం కోసం వాటిని సపోర్ట్ చేయలేని ఫోన్లలో సేవలు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. కొత్తగా వస్తున్న కంపెనీలతో పోటీ పడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
వాట్సాప్ సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటుంది. ఇంతకుముందు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు కొన్ని మోడల్స్ కి మాత్రమే సేవలు నిలిపివేశారు. కానీ, ఇప్పుడు మొదటిసారి పాత ఆండ్రాయిడ్, విండోస్ మరియు ఐ ఓఎస్ వాడుతున్న వేల కొద్దీ మోడల్స్ లో సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల కొత్తగా వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో మరింత మెరుగైన సేవలు అందించటం సాధ్యపడుతుందని కంపెనీ భావిస్తుంది. విండోస్ ఫోన్స్ లో పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 2.3.7 లేదా అంతకంటే పాత మోడల్స్ లో ఫిబ్రవరి నుండి సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. దీనివలన ఇప్పటి వరకు ఆ మోడల్స్ వాడుతున్న వినియోగదారులు కొత్త మొబైల్స్ కొనాల్సిన అవసరం రావొచ్చు, లేదా ఈ అవకాశాన్ని వాడుకోవడానికి వేరే ఏదైనా యాప్ రంగంలోకి దిగే అవకాశం ఉంది.
ఐ ఓఎస్ 8 లేదా ఇంకా పాత మోడల్స్ వాడుతున్న వినియోగదారులకు కూడా ఫిబ్రవరి నుండి సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ మోడల్స్ లో కొత్తగా వాట్సాప్ అకౌంట్స్ చేసే అవకాశం ఉండేది కాదు, ఇప్పుడు సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇంతకుముందు ఇలా సేవలు నిలిపివేసిన సందర్భంలో వినియోగదారుల సంఖ్య తక్కువ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు వేలమందికి సేవలు నిలిపివేయబోతున్నారు. దీనిని ఉద్దేశించి కంపెనీ మరింత మెరుగైన సేవలు అందించటానికి ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని పేర్కొంది.