సీఈఎస్ – 2020: అదృశ్య కీబోర్డ్, మానవరూప రోబో మరియు కృత్రిమ సూర్యరశ్మి ప్రదర్శించనున్న శామ్సంగ్

ప్రఖ్యాత సాంకేతిక రంగ ప్రదర్శన కన్సూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2020 కి రంగం సిద్ధమైంది. ప్రముఖ సంస్థలన్నీ వాళ్ళ సాంకేతిక రంగ ఆవిష్కరణలు ప్రదర్శించి తామేంటో నిరూపించుకోవాలని పోటీ పడుతున్నారు. కేవలం వ్యాపార సంస్థలే కాదు, సాధారణ ప్రజలు కూడా అంతే ఆతృతగా నూతన ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆవిష్కరణలు ప్రదర్శించబోతున్నామని ప్రకటించిన శాంసంగ్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. తమ అంతర్గత విభాగం సి-ల్యాబ్ నుండి కనీసం ఐదు వినూత్న ఉత్పత్తులు ప్రదర్శిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2012 లో క్రియేటివ్ ల్యాబ్ (సి-ల్యాబ్) ప్రారంభించినప్పటినుండి తమ కంపెనీ ఉద్యోగులు జట్టుగా ఏర్పడి వినూత్న ఆవిష్కరణలు మరియు నూతన పరిశ్రమల కోసం కృషి చేసేలా చర్యలు తీసుకుంటుంది. సి-ల్యాబ్ నుండి ఈ ఏడాది కొన్ని ఆసక్తికరమైన ఉత్పత్తులు ప్రదర్శించబోతున్నారు.

సీఈఎస్ - 2020: అదృశ్య కీబోర్డ్, మానవరూప రోబో, ఫ్రేమ్ లెస్ టీవీ మరియు కృత్రిమ సూర్యరశ్మి ప్రదర్శించనున్న శామ్సంగ్

సెల్ఫీ టైప్

శాంసంగ్ ఆవిష్కరణలన్నిటిలో సీఈఎస్ 2020 లో అత్యంత ఆశక్తిదాయకమైనది సెల్ఫీ టైప్. కీబోర్డ్ అవసరం లేకుండా సెల్ఫీ కెమెరా ఉపయోగించుకుని గాల్లో టైప్ చేస్తే క్వేర్టీ కీబోర్డ్ పై వేళ్ళ అమరికకు అనుగుణంగా టైప్ అవుతుంది. వినటానికి బాగానే ఉన్నా కీబోర్డ్ లేకుండా లెటర్స్ ఎలా గుర్తు పెట్టుకుంటారనేది ఈవెంట్ లో ప్రదర్శించిన తరువాతే తెలుస్తుంది. ఇప్పటికే లేసర్ కీబోర్డ్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సెల్ఫీ టైప్ భవిష్యత్తులో కీబోర్డ్ అవసరం లేకుండా చాటింగ్ చేసే అవకాశం కల్పిస్తుందేమో చూడాలి.

పీబో

శాంసంగ్ నుండి వస్తున్న మరో నూతన ఆవిష్కరణ పీబో. ఈ మానవరూప రోబో ఒంటరిగా ఉండే వ్యక్తులకు తోడుగా ఉంటుందని తెలుస్తుంది. పీబో సాధారణ సంభాషణల నుండి వాతావరణ సమాచారం వరకు చాలా చెప్పగలదంటున్నారు. అంతేకాకుండా వినియోగదారుల ముఖ కవళికల ఆధారంగా సంభాషణా విషయాలను కూడా ఎంపిక చేసుకోగలదు అంటున్నారు.

ఫ్రేమ్ లెస్ టీవీ

ఫ్రేమ్ లెస్ టీవీ గురించి శాంసంగ్ అధికారిక ప్రకటన చేయలేదు, కానీ జనవరి 6న జరగబోతున్న సీఈఎస్ 2020 ఈవెంట్ గురించి విడుదల చేసిన టీజర్ లో ఈ టీవీ ని సూచనగా తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో బెజెల్ లెస్ టీవీ కోసం పేటెంట్ తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఈవెంట్ లో ప్రదర్శించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు బెజెల్ లెస్ అని వచ్చిన టీవీలు అన్నిటిలో సన్నటి ఫ్రేమ్ ఉంటుంది. అసలు ఫ్రేమ్ లేకపోతే స్క్రీన్ ఎలా నిలబడుతుంది అనే సందేహాలు రావటం సహజమే. 65 అంగుళాల కంటే పెద్ద డిస్ప్లే ఉన్న టీవీలలో స్క్రీన్ ని నేరుగా బాడీకి వెల్డింగ్ చేస్తారని సమాచారం. శాంసంగ్ నిజంగా ఈ టీవీలను అందుబాటులోకి తెచ్చినా కూడా ఇవి సామాన్యులకి చేరువలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. శాంసంగ్ 8కే చిప్ ని ప్రత్యేకంగా ఈ టీవీల కోసం తయారు చేయించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫ్రేమ్ లెస్ టీవీ ధరలు ఆకాశాన్నంటుతాయనడంలో సందేహం లేదు.

సన్నీ సైడ్

మరొక ఆసక్తికరమైన ఆవిష్కరణ సన్నీ సైడ్. శాంసంగ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది ఒక కాంతి పరికరం. ఇది కృత్రిమ సూర్యరశ్మిని తయారుచేసి రోజులో సమయానికి తగ్గట్టుగా వేడి మరియు కాంతిని సర్దుబాటు చేయగలదు. మన దగ్గర సంవత్సరంలో ఎక్కువ భాగం సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి పరికరాల అవసరం ఉండదు కానీ, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని నెలలు మాత్రమే సూర్యరశ్మి లభిస్తుంది. అలాంటివాళ్లకు శరీరంలో డి విటమిన్ లోపించే అవకాశాలు ఎక్కువ. అలాంటివారికి ఈ పరికరం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే వినియోగదారులు వేడి వల్ల చర్మం కందిపోవటం లేదా ముడతలు పడటం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండదని శాంసంగ్ ప్రతినిధులు చెప్తున్నారు.

Leave a Comment