అర్గళా స్తోత్రం దుర్గా సప్తశతిలో చెప్పబడిన శక్తివంతమైన స్తోత్రం. అర్గళా అంటే గడియ. ఒక గది లోపల భద్రపరిచి ఉన్న నిధిని పొందడానికి గడియను ఎలా తీయాలో, అలాగే దేవీ అనుగ్రహం అనే మహా నిధిని పొందడానికి మనలోని అడ్డంకులను తొలగించే మంత్రం ఈ అర్గళా స్తోత్రం. ఇది దుర్గా దేవిని కీర్తించే 27 శ్లోకాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ అర్గళా స్తోత్రం చదవటం వల్ల అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చింతన కూడా అలవడుతుంది. అందుకే తెలుగు రష్ మీకోసం ఈ స్తోత్రాన్ని పిడిఎఫ్ రూపంలో అందిస్తుంది.
అర్గళా స్తోత్రం
ఓం అస్య శ్రీ అర్గలాస్తోత్రమహామంత్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాలక్ష్మీర్దేవతా, శ్రీ జగదంబాప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః ||
ఓం నమశ్చండికాయై |
మార్కండేయ ఉవాచ |
ఓం జయ త్వం దేవి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోఽస్తు తే || 1 ||
అర్ధం – ప్రాణి కోటి యొక్క దుఃఖాలను హరించే ఓ చాముండీ! నీకు జయము. అంతటా వ్యాపించి ఉన్న దేవీ! కాళరాత్రి స్వరూపిణీ! నీకు నమస్కారం.
జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే || 2 ||
అర్ధం – జయంతి, మంగళ, కాళి, భద్రకాళి, కపాలిని, దుర్గ, శివ, క్షమ, ధాత్రి, స్వాహా, స్వధా అనే పేర్లతో పిలువబడే ఓ జగన్మాతా! నీకు నమస్కారం.
మధుకైటభవిధ్వంసి విధాతృవరదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 3 ||
అర్ధం – మధుకైటభులను అంతం చేసి, బ్రహ్మదేవునికి (విధాతృ) వరాలనిచ్చిన ఓ తల్లి, నాకు (ఆధ్యాత్మిక) స్వరూపాన్ని, విజయాన్ని, కీర్తిని ప్రసాదించు, అంతర్గత శత్రువులను సంహరించు.
మహిషాసురనిర్నాశి భక్తానాం సుఖదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 4 ||
అర్ధం – మహిషాసురుడిని అణచివేసి భక్తులకు సుఖాన్నిచ్చే ఓ దేవీ! నాకు (ఆధ్యాత్మిక) స్వరూపాన్ని, విజయాన్ని, కీర్తిని ప్రసాదించు, అంతర్గత శత్రువులను సంహరించు.
ధూంరనేత్రవధే దేవి ధర్మకామార్థదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 5 ||
అర్ధం – ధూమ్రలోచనుడిని (నేత్ర) వధించి, ధర్మార్థకామాలను సిద్ధింపజేసే ఓ దేవీ!
రక్తబీజవధే దేవి చండముండవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 6 ||
అర్ధం – రక్తబీజుడిని, చండముండలను వినాశనం చేసిన ఓ దేవీ! నాకు (ఆధ్యాత్మిక) స్వరూపాన్ని, విజయాన్ని, కీర్తిని ప్రసాదించు, అంతర్గత శత్రువులను సంహరించు.
నిశుంభశుంభనిర్నాశి త్రైలోక్యశుభదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 7 ||
అర్ధం – శుంభ నిశుంభుల గర్వాన్ని అణచి ముల్లోకాలకు శుభం చేకూర్చే ఓ దేవీ!
వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 8 ||
అర్ధం – సకల దేవతలచే నమస్కరింపబడే పాదయుగళం కలదానా! సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఓ దేవీ!
అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 9 ||
అర్ధం – ఊహకందని (అచింత్య) రూపము, చరిత్ర కలిగినదానా! సకల శత్రువులను నాశనం చేసే ఓ దేవీ!
నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 10 ||
అర్ధం – ఎల్లప్పుడూ భక్తితో నీకు నమస్కరించే వారి పాపాలను (దురిత) హరించే ఓ అపర్ణా దేవీ!
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 11 ||
అర్ధం – భక్తితో నిన్ను స్తుతించే భక్తుల వ్యాధులను (శారీరక మరియు మానసిక బాధలను) రూపుమాపే ఓ చండికా మాతా!
చండికే సతతం యుద్ధే జయంతి పాపనాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 12 ||
అర్ధం – జీవితమనే యుద్ధంలో నిరంతరం మాకు విజయాన్ని చేకూర్చే ఓ జయంతి! మా పాపాలను నశింపజేసే తల్లి!
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 13 ||
అర్ధం – ఓ దేవీ! నాకు లౌకికమైన సౌభాగ్యాన్ని, శారీరకమైన ఆరోగ్యాన్ని మరియు పారలౌకికమైన పరమ సుఖాన్ని ప్రసాదించు.
విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియం |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 14 ||
అర్ధం – ఓ దేవీ! నాకు మంగళమును (కల్యాణము), అపారమైన ఐశ్వర్యమును (విపులాం శ్రియమ్) ప్రసాదించు.
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 15 ||
అర్ధం – నా శత్రువులను (బాహ్య మరియు అంతర్గత శత్రువులైన కామ క్రోధాదులు) నాశనం చేయి. నాకు అత్యున్నతమైన బలమును (శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలం) అనుగ్రహించు.
సురాసురశిరోరత్ననిఘృష్టచరణేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 16 ||
అర్ధం – సురులు (దేవతలు), అసురులు (రాక్షసులు) నీకు తలవంచి నమస్కరిస్తున్నప్పుడు, వారి కిరీటాలలోని రత్నాల రాపిడి వల్ల నీ పాదాలు మరింత ప్రకాశిస్తున్నాయి. అట్టి అంబికా!
విద్యావంతం యశస్వన్తం లక్ష్మీవంతంచ మాం కురు |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 17 ||
అర్ధం – నన్ను విద్యావంతునిగా, కీర్తిమంతునిగా మరియు సంపన్నునిగా (లక్ష్మీవంతునిగా) తీర్చిదిద్దు తల్లి.
దేవి ప్రచండదోర్దండదైత్యదర్పనిషూదిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 18 ||
అర్ధం – భయంకరమైన బాహుబలం కలిగిన రాక్షసుల గర్వాన్ని అణచివేసిన ఓ ప్రచండ శక్తి! నీకు నమస్కారం.
ప్రచండదైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయ మే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 19 ||
అర్ధం – భయంకరమైన రాక్షసుల గర్వాన్ని అణచివేసిన ఓ చండికా దేవీ! నీకు ప్రణమిల్లుతున్న నాకు దివ్య రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదించు. నాలోని అంతర్గత శత్రువులను తొలగించు.
చతుర్భుజే చతుర్వక్త్రసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 20 ||
అర్ధం – నాలుగు భుజములు కలిగిన దానా! నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవునిచే (చతుర్వక్త్ర) నిరంతరం స్తుతింపబడే ఓ పరమేశ్వరీ! నీకు నమస్కారం.
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 21 ||
అర్ధం – శ్రీకృష్ణునిచే ఎల్లప్పుడూ అత్యంత భక్తితో కీర్తింపబడే ఓ అంబికా! నీకు నమస్కారం. (శ్రీకృష్ణుడు కూడా శక్తి ఉపాసకుడని ఇక్కడ సూచన).
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 22 ||
అర్ధం – హిమవంతుని పుత్రిక అయిన పార్వతికి నాథుడైన ఆ పరమశివునిచే (హిమాచలసుతానాథ) స్తుతింపబడే ఓ పరమేశ్వరీ! నీకు నమస్కారం.
ఇంద్రాణీపతిసద్భావపూజితే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 23 ||
అర్ధం – ఇంద్రాణి భర్త అయిన దేవేంద్రునిచే సద్భావముతో (పవిత్రమైన భక్తితో) పూజింపబడే ఓ పరమేశ్వరీ! నీకు నమస్కారం.
దేవి భక్తజనోద్దామదత్తానందోదయేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 24 ||
అర్ధం – భక్తుల హృదయాలలో గొప్పదైన (ఉద్దామ) ఆనందాన్ని ఉదయింపజేసే ఓ అంబికా! మాకు విజయాన్ని ప్రసాదించు.
భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 25 ||
అర్ధం – ఓ దేవీ! నా మనస్సుకు నచ్చే (మనోరమాం), నా మనోభావాలను అనుసరించి నడుచుకునే (మనోవృత్తానుసారిణీమ్) ఉత్తమమైన భార్యను ప్రసాదించు. (ఇది గృహస్థాశ్రమంలో శాంతిని, సఖ్యతను కోరుకునే ప్రార్థన).
తారిణి దుర్గసంసారసాగరస్యాచలోద్భవే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 26 ||
అర్ధం – దాటడానికి సాధ్యం కాని ఈ భయంకరమైన సంసార సముద్రాన్ని దాటించే ఓ తారిణీ! హిమవంతుని పుత్రికా (అచలోద్భవే)! నాకు దివ్య రూపాన్ని, జయాన్ని, కీర్తిని ఇచ్చి నాలోని అరిషడ్వర్గాలను సంహరించు.
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః |
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం || 27 ||
అర్ధం – ఎవరైతే ఈ అర్గళా స్తోత్రాన్ని పఠించి, ఆపై ‘దేవీ సప్తశతీ’ (మహాస్తోత్రం) పారాయణ చేస్తారో… వారు దేవీ అనుగ్రహంతో సామాన్యులకు లభించని అత్యంత దుర్లభమైన వరాలను పొందుతారు.
ఇతి శ్రీమార్కండేయపురాణే అర్గళా స్తోత్రం |
ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం మరిన్ని దుర్గా స్తోత్రాలు చదవండి.