క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ట్రైలర్ విశ్లేషణ

✅ Fact Checked

క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ సినిమా ప్రారంభించినప్పటినుండి ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ మాత్రం చాలామంది ప్రేక్షకులకు గందరగోళంగా అనిపించింది. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ సినిమాలంటేనే ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటాయి, కానీ ట్రైలర్స్ సాధారణంగా కమర్షియల్ పంథాలో సాగుతాయి. ఈసారి ట్రైలర్ నుండే ప్రేక్షకులు కథ ఏమై ఉంటుందో అని చర్చించుకునేలా చేసారు. అందుకే ట్రైలర్ చివరిలో దీన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించొద్దు, ఆస్వాదించండి అని కొసమెరుపు జతచేసారు. కానీ ట్రైలర్ ని అర్ధం చేసుకోవాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు రష్ ట్రైలర్ వివరణ చదవండి.

క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ట్రైలర్ విశ్లేషణ

టెనెట్ శైలి / జోనర్

టెనెట్ ఒక ఎస్పీనాజ్ థ్రిల్లర్. అంటే ఒక జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఉంటుంది. ఈ సినిమా చర్చల దశలో ఉన్నప్పుడు చాలా మంది క్రిస్టోఫర్ నోలన్ ఒక జేమ్స్ బాండ్ సినిమా తీయబోతున్నాడని ప్రచారం చేసారు. జేమ్స్ బాండ్ సినిమాలలో హీరో ఒక దేశాన్ని లేదా ప్రపంచాన్ని జరగబోయే ప్రమాదం నుండి కాపాడతాడు. యాక్షన్ సీన్స్, కార్ చేస్ లు, టెక్నాలజీ, వీ ఎఫ్ ఎక్స్ లాంటివి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. టెనెట్ లో కూడా ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇందులో కూడా ఒక రహస్య సంఘం మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంటుంది. హీరో ఆ సంఘంలో చేరటంతో కథ ప్రారంభమవుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం అణ్వయుధాల వల్ల కాదని, అంతకంటే ప్రమాదకరమైన ఆయుధం ఉందని ట్రైలర్ లో చెప్తారు. కథలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ మరియు రాబర్ట్ ప్యాటిన్సన్ అనే ఇద్దరు హీరోలుంటారు, కానీ ట్రైలర్ లో ఎక్కువ శాతం జాన్ డేవిడ్ వాషింగ్టన్ ని చూపించారు. వాళ్లిద్దరూ కలిసి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎలా ఆపుతారనేది ప్రధాన కథాంశం.

టెనెట్ కథ

టెనెట్ అంటే ఒక మతం లేదా సంస్థ యొక్క కీలక సిద్దాంతం. మన ప్రపంచానికి కూడా విజ్ఞ్యాన శాస్త్రం లో గురుత్వాకర్షణ శక్తి లాంటి కొన్ని సిద్ధాంతాలుంటాయి. ట్రైలర్ లో టెనెట్ ని సగం తలక్రిందులు చేసి చూపిస్తారు. ఒకరకంగా ఈ సిద్దాంతాలని మార్చే ఆలోచనని స్పష్టం చేసారు. ఈ సినిమా మొదటి టైటిల్ లోగో లో టెనెట్ అని గడియారం ముల్లుతో రాసారు. మన ప్రపంచానికి కీలక సిద్ధంతమైన సమయాన్ని మార్చడం కథలో అంతర్భాగంగా కనిపిస్తుంది.

హీరోని తమ సంస్థలో చేర్చుకోవటానికి ఒక పరీక్ష పెడతారు. అందులో భాగంగా అతను సంస్థ కోసం చనిపోవడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత అతన్ని సంస్థలో చేర్చుకుంటారు. ఇక్కడే మరణానంతర జీవితానికి స్వాగతం అని చెప్తారు. హీరో నిజంగానే చనిపోయాడా, లేదా చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించారా అనేది సినిమాలో చూడాలి. ఇక్కడినుండి కథలో టైం ట్రావెల్ ప్రారంభమవుతుంది. టైం ట్రావెల్ అంటే ఇక్కడ మాయమైపోయి గతంలోనో లేదా భవిష్యత్తులోనో ప్రత్యక్షం అవటం కాదు. హీరో టీం అంత రివర్స్ లో వెనక్కి వెళ్తారు, అంటే రోడ్ మీద కార్లు, పట్టాల మీద రైళ్లు, సముద్రంలో నౌకలు అన్ని రివర్స్ లో వెళ్తుంటే వీళ్ళు మాత్రం సాధారణంగా ఉంటారు. ఇక్కడే క్రిస్టోఫర్ నోలన్ తన ప్రతిభ కనబరిచాడు. కేవలం ట్రైలర్ లో ఎంత చూపించాలో అంతే చూపించి కథ పూర్తిగా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. దీన్ని బట్టి కథ చాలా రకాలుగా చెప్పొచ్చు.

టెనెట్ అనే పదానికి కూడా కథతో సంబంధం ఉంది. హీరోకి టెనెట్ అనే పదం ఉపయోగిస్తే కొన్ని మార్గాలు తెరుచుకుంటాయని, వాటిలో మంచి-చెడు రెండు రకాల దారులు ఉంటాయని చెప్తారు. ట్రైలర్ ప్రారంభంలో “మనమందరం తగలబడుతున్న భవనంలోకి వెళ్తున్నాం అని నమ్ముతాం కానీ వేడి తగిలే వరకు తెలుసుకోలేము, కానీ నీకు తెలుస్తుంది” అని చెప్తారు. హీరో ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి కాలాన్ని వెనక్కి వెళ్లేలా చేయొచ్చు లేదా వెనక్కి వెళ్లి జరిగిపోయిన సంఘటనలని మార్చొచ్చు. ట్రైలర్ మొదటి షాట్ లో హీరో తాడు కట్టుకుని బిల్డింగ్ పైకి జంప్ చేస్తాడు. దీన్ని బట్టి టైం ట్రావెల్ అనేది వీళ్ళ అధీనం లో ఉందని అర్ధం అవుతుంది. అసలు ఆ టెక్నాలజీ ఏంటి, దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తారు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. టెనెట్ జులై 17, 2020 న విడుదలవుతుంది.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.