బోయపాటి శ్రీను పరిస్థితి ఏంటి?

✅ Fact Checked

మారుతున్న ట్రెండ్ తో పాటు సీనియర్ హీరోల మార్కెట్ కూడా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ మార్కెట్ దారుణంగా పడిపోయింది. కమర్షియల్ సినిమాలని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయకపోవటం ప్రధాన కారణం కాగా మూస ధోరణిలో సినిమాలు చేయటం కూడా ఒక కారణం. ఒకప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా చలామణి అయిన బాలకృష్ణ ఇప్పుడు సక్సెస్ కోసం ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. దానికి పోటీగా వచ్చిన బోయపాటి శ్రీను వినయ విధేయ రామ కూడా పరాజయం పాలయింది.

బోయపాటి పరిస్థితి ఏంటి?

ఈ మధ్య విడుదలైన రూలర్ సినిమా కూడా బాలయ్య కెరీర్ లో మర్చిపోదగ్గ సినిమాగా మిగిలింది. రూలర్ ప్రభావం బాలయ్య తదుపరి సినిమాలపై పడే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మొదలైన సినిమాపై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. సరైనోడు తర్వాత బోయపాటి డిమాండ్స్ కూడా ఎక్కువయ్యాయి. అవసరం లేకపోయినా, ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన వినయ విధేయ రామ కోసం విపరీతంగా ఖర్చుపెట్టాడు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. ఇప్పుడు బాలయ్య తో చెయ్యబోయే సినిమాకోసం కూడా 70 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇంత బడ్జెట్ పెడితే ఎంత తిరిగి వస్తుందనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాత కూడా భావించి సినిమాని హోల్డ్ లో పెట్టాడని అంటున్నారు.

మీడియం రేంజ్ డైరెక్టర్ గా ఉన్న బోయపాటి అత్యాశకు పోయి ఉన్న అవకాశాలు చేయిజార్చుకున్నాడని అనుకుంటున్నారు. బాలయ్యకి ఇది కాకపోతే ఇంకొక ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది. కానీ బోయపాటితో సినిమా అంటే నిర్మాతలు ధైర్యం చెయ్యటం లేదు. బాలయ్యతో కూడా అతికష్టం మీద సినిమా ఫైనలైజ్ అయింది. ఇప్పుడు ఇది కూడా చేయిజారిపోతే పరిస్థితి ఏంటని బోయపాటి శ్రీను ఆలోచిస్తున్నాడు.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.